పేజీలు

31, జనవరి 2014, శుక్రవారం

సున్న రూపాయి కాగితం

                                          (ఈ చిత్రం www.5thpillar.org నుండి సేకరించబడినది)

             మీరు పైన చూస్తున్నది సున్న రూపాయి కాగితం. యాభై రూపాయల కాగితం నమూనాలో ముద్రించబడినది. ఇది సరదాగా ముద్రించినది మాత్రం కాదు. దీని వెనుక ఒక మంచి ఆశయం ఉంది. ఇది 'ఐదవ స్తంబము' అనే లాభాపేక్షలేని సంస్థ  మనదేశంలోని లంచగొండితనాన్ని ఎదురుకోవాలనే సంకల్పంతో 2007 లో మొదలుపెట్టిన కార్యక్రమం. ఈ సంస్థను విజయానంద్ అనే సమాచార సాంకేతిక నిపుణుడు అమెరికా నుండి తిరిగి వచ్చి 2006లో స్థాపించాడు. ఆసక్తిగలవారు మరిన్ని వివరాలు కోసం పైన చిత్రం క్రింద ఇవ్వబడిన చిరునామాని సందర్శించండి.


26, జనవరి 2014, ఆదివారం

జాతీయ 'ఓటర్ల ' దినోత్సవం


              ఈ రోజు దినపత్రిక తిరగవేస్తుంటే ఒక కొత్త విషయం తెలిసింది. అది 'జాతీయ ఓటర్ల దినోత్సవం' ('ఓటర్ ' అనే ఆంగ్ల పదము తెలుగు పదముగా స్థిర పడ్డట్లేనా?) అనేది ఒకటి ఉందనీ, అది జనవరి 25న అని. అంటే, ఏమిటా అని కుతూహలం కొద్ది అంతర్జాలంలో వెతికాను. మన భారత ప్రభుత్వం ఎన్నికల సంఘం ఏర్పడిన రోజుని (అది జనవరి 25, 1950లో ఏర్పడింది) 2011వ సంవత్సరం నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా పరిగణిస్తున్నదని తెలిసింది. ఇంకా వివరాలలోకి వెళ్ళితే, ఈ రోజున 18 సంవత్సరములు నిండిన యువతకు ఓటరు గుర్తింపు 'కార్డు' లు ('కార్డు' కూడా మన భాషలో కలిసిపోయింది!?) జారి చేస్తారని తెలిసింది. ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం సజావుగా సాగుతుంటే, సంతోషించ దగిన విషయమే.

             అందఱికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.