పేజీలు

20, మార్చి 2014, గురువారం

యకారము, వు, వూ, వొ, వో అనే అక్షరములు తెలుగు పదములకు మొదట లేవు

        మన భాషలో వేరే భాష నుండి వచ్చి కలసిన పదములు అనేకం ఉన్నాయని మనకి తెలుసు. కాని ఆవి ఏవో మనకు చాలా వరకు తెలియదు. అవి తెలుసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి, దానికంటే ముందుగా మనకు తెలిసిన తెలుగు పదములను మనము తప్పకుండా గుర్తించాలి. తప్పుగా వ్రాస్తుంటే సరిచేసుకోవాలి. నేను చేస్తున్న ఆ ప్రయత్నంలో నేను నేర్చుకున్న ఈ సూత్రం మీ ముందు ఉంచుతున్నాను.

యకారము, వు, వూ, వొ, వో అనే అక్షరములు తెలుగు పదములకు మొదట లేవు.

        మనం విశ్లేషించుకుంటే ఈ సూత్రం ప్రకారం మనకు కొన్ని విషయాలు బోధపడతాయి. అలాగే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. మొదట మనం అర్ధం చేసుకోవలసినవి చూసుకుంటే 1) మన భాషలో ఈ అక్షరములతో మొదలయ్యే పదములు ఉండవు అని అర్ధం అవుతున్నది. 2) మనకు తెలిసిన చిన్న చిన్న పదములు మనం తప్పుగా వ్రాస్తుంటే సరిదిద్దుకోవచ్చు. ఇక, ఎందుకు ఉండవు అంటే ఎ, ఏ, ఉ, ఊ, ఒ, ఓ అనే అక్షరములతో పదములు మొదలవుతాయని దీని అర్ధం.

ఉదాహరణలు:

ఉత్తరం, ఉడుత, ఊరు; ఊపిరి, ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఏల, ఒక్కటి, ఒంటె, ఓడ, ఓనమాలు

        చివరగా, మన భాషలో చాలా పదములు సంస్కృతము నుండి వచ్చి కలిసాయని మనలో చాలా మందికి విదితమే. 'ఒ' అనే అక్షరము సంస్కృతములో లేదు. అంటే, 'ఒ' తో మొదలయ్యే పదములు చాలా వరకు తెలుగువే అని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఓటు, ఓటరు అనే పదములు మన ఆంగ్ల పరిజ్ఞానంతో ఆ బాష నుండి కలిసాయని మనకు తెలిసినదే.

గమనిక/విజ్ఞప్తి: పైన చర్చించిన విషయములో ఏవైనా  తప్పులుంటే విజ్ఞులు సరిదిద్దగలరు. ఏదైనా జతచెయ్యదలచినా, సదా ఆహ్వానం.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి